||సుందరకాండ ||

||పన్నెండవ సర్గ తెలుగులో||


|| Om tat sat ||


శ్లో|| స తస్య మధ్యే భవనస్య మారుతిః
లతాగృహంశ్చిత్రగహాన్నిశాగృహాన్|
జగామ సీతాం ప్రతిదర్శనోత్సుకో
న చైవ తాం పశ్యతి చారుదర్శనామ్||1||
స|| సః మారుతిః తస్య భవనస్య మధ్యే సీతాం ప్రతి దర్శనోత్సుకః లతా గృహాన్ చిత్రగృహాన్ నిశాగృహాన్ జగామ| చారుదర్శనామ్ తాం న పశ్యతి ఏవ ||
తా|| ఆ మారుతి ఆ భవనముల మధ్యలో సీతను వెదకవలెనను ఉత్సాహముతో లతాగృహములు, చిత్రగృహములు , రాత్రిభవనములు అన్నీచూచెను. కాని శుభముగా కనపడు ఆమె మాత్రము కనపడలేదు
సుందరకాండ.
అథ ద్వాదశస్సర్గః

ఆ మారుతి ఆ భవనముల మధ్యలో సీతను వెదకవలెనను ఉత్సాహముతో లతాగృహములు, చిత్రగృహములు , రాత్రిభవనములు అన్నీచూచెను. కాని శుభముగా కనపడు ఆమె మాత్రము కనపడలేదు.

అప్పుడు ఆ మహాకపి రఘునందనుని ప్రియురాలైన ఆమెను చూడలేకపోగా అలోచనలో పడెను. మైథిలి వెతుకుతూ "నాకు సీతా దర్శనము దొరకుటలేదు. ఆమె తప్పక మరణించిఉండవచ్చును. ఆ జానకి ఆర్య మార్గములో ఉండి తన శీలము రక్షించుకొంటూ ఈ దుష్టకర్మలు చేయు రాక్షస ప్రవరులచేత తప్పక చంపబడియుండును. ఆ జనకేశ్వరుని కూతురు విరూపము గలవారు, వికృతమైనవారు, కాంతిలేని వారు, పెద్దకళ్ళుకలవారు, పొడవుగా వికృతముగా కనపడు వారు అగు రాక్షసరాజ వనితలను చూసి భయముతో మరణించవచ్చు.

సీతను చూడకుండా , ఆ పురుషకార్యము సాధించకుండా, వానరులతో చిరకాలము గడిపి సుగ్రీవుని సమీపమునకు వెళ్ళుట కుదరదు. ఆ వానరాధిపతి అతి బలవంతుడు. కఠిన దండము విధించువాడు.

" అంతః పురము అంతా చూడబడినది. రావణస్త్రీలు అందరూ చూడబడిరి. సాధ్వీ సీత కనపడుటలేదు. నా శ్రమ వృధా అయినది. తిరిగి వచ్చిన నన్ను వానరులందరూ ఏమి అంటారు. 'ఓ వీరుడా అక్కడకి వెళ్ళి ఏమి చేసినవాడవు'?"

"కాలాఅవధి దాటిపోయినతరువాత ఆ జానకిని కనుగొనక వారికి ఏమి చెప్పెదను? వారు తప్పక ప్రాయోపవేశము చేసెదరు. సముద్రమును దాటి వచ్చిన నన్ను వృద్ధుడు జాంబవంతుడు అంగదుడు తక్కిన వానరులు ఏమి అంటారు?"

నిర్వేదము లేకుండుటమే శ్రియమునకు కారణము. నిర్వేదము లేకుండుట పరమ సుఖము. నిర్వేదము లేకుండా ఉన్నవాడు అన్ని ప్రయత్నములలోనూ సఫలుడు అగును. జీవుడు కర్మచేసినచో అది సఫలము అగును. అందువలన నిర్వేదము లేకుండా ఉత్తమమైన ప్రయత్నము చెసెదను. మళ్ళీ చూడబడని రావణ పాలిత దేశమును చూచెదను.

పానశాలలు చూడబడినవి. పుష్పగృహములు చూడబడినవి. చిత్రశాలలు చూడబడినవి. మళ్ళీ క్రీడా గృహములు కూడా చూడబడినవి. ఉద్యానముల మధ్యలోనున్న వీధులు కూడా చూడబడినవి. విమానములు కూడా చూడబడినవి. అన్నిప్రదేశములు చూడబడినవి.

ఈ విధముగా అలోచించి భూమి గృహములు, చైత్య ప్రాసాదములు , విడివిడిగా నున్న గృహములు మళ్ళీ వెదుకుట మొదలుపెట్టెను. ఆ మహాకపి మళ్ళీ మళ్ళీ ఎక్కుతూ దిగుతూ, ద్వారములు దాటుతూ, తలుపులను తీస్తూ, లోపలికి ప్రవేశిస్తూ బయటకి వస్తూ అవకాశము ఉన్నంతవరకు వెదుకుతూ తిరిగెను.

ఆ రావణాంతః పురములో ఆ వానరుడు ఎక్కడవెళ్ళలేదో అది నాలుగు అంగుళములు కూడా ఉండదు. ప్రాకారము నడుమ గల వీధులు , చైత్యప్రాసాదముని ఆనుకుని ఉన్న వేదికలు, పుష్కరిణులు అన్నీ చూడబడినవి.

అక్కడ హనుమంతుడు వివిధాకారములు కల వికృతరూపము గల రాక్షసులను చూచెను. కాని జనకాత్మజను చూడలేదు. అ హనుమంతునికి అక్కడ లోకము లో సాటిలేని విద్యాధరస్త్రీలు కనపడ్డారు కాని సీత కనపడలేదు.

హనుమంతుడు అక్కడ అతిసౌందర్యవతులగు పూర్ణచంద్రునివంటి వదనము కల నాగకన్యలు కనపడిరి. కాని సన్నని నడుము కల సీత కనపడలేదు. రాక్షసేంద్రునిచేత బలముతో ఓడింపబడి తీసుకురాబడిన నాగకన్యలను చూచెను. కాని సీత కనపడలేదు.

మహాబాహువు, ధీమంతుడు అగు మారుతాత్మజుడు అయిన హనుమంతుడు ఆ సీతను చూడక ఇతర వర స్త్రీలను చూచి మళ్ళీ నిరుత్సాహపడెను.

అప్పుడు ఆ మారుతాత్మజూడగు హనుమంతుడు శోకములో మునిగినవాడై ఆ విమానమునుండి క్రిందకి దిగి ఆలోచించ సాగెను.

ఈ విధముగా వాల్మీకి రామాయణములోని సుందరకాండలో పన్నెండవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||
శ్లో|| అవతీర్య విమానాచ్చ హనుమాన్ మారుతాత్మజః |
చిన్తాముపజగామా థ శోకోపహతచేతనః||25||
స|| అథ మారుతాత్మజః హనుమాన్ విమానాత్ అవతీర్య శోకోపహతచేతనః చిన్తాం ఉపజగామ||
తా|| అప్పుడు ఆ మారుతాత్మజూడగు హనుమంతుడు శోకములో మునిగినవాడై ఆ విమానమునుండి క్రిందకి దిగి ఆలోచించ సాగెను.
||ఓమ్ తత్ సత్||